ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం

ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం
- కిలో రెండు రూపాయలకే టమోటా…
- పంట కోయడానికే ఖర్చు ఎక్కువ… అమ్మితే నష్టం
- మార్కెట్‌లో బాక్సుకు 40 రూపాయలు… రైతు లబోదిబో
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పొలాల్లో ఎర్రగా మెరిసే టమోటా కాయలు ఈసారి రైతుల జీవితాల్లో ఆనందం తీసుకురాలేదు. ఆశలు నింపిన పంట చివరికి రైతుల గుండెల్లో బాధను మాత్రమే మిగిల్చింది. కర్నూలు జిల్లాలో టమోటా ధరలు కుప్పకూలడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఎమ్మిగనూరు మార్కెట్‌లో 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం రూ.50 రూపాయలకే పడిపోవడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అంటే కిలోకు కేవలం రెండు రూపాయలు మాత్రమే రావడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది.
జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో అనేక మంది రైతులు టమోటా పంటను పెద్ద ఎత్తున సాగు చేశారు. ఒక ఎకరాకు 60 వేల నుంచి 80 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. విత్తనాలు, ఎరువులు, మందులు, నీటి ఖర్చులు, కూలీల వ్యయాలు అన్నీ కలిపి రైతులు అప్పులు చేసి ఈ పంటను సాగు చేశారు. పంట కూడా బాగా పండింది. మంచి దిగుబడి రావడంతో ఈసారి టమోటాతో అప్పులు తీర్చుకుని కుటుంబాన్ని గాడిలో పెట్టాలని రైతులు ఆశపడ్డారు.
కానీ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆ ఆశలు క్షణాల్లో మాయమయ్యాయి. ఒక ఎకరా పొలంలో సుమారు 300 బాక్సుల వరకు టమోటా దిగుబడి వస్తుంది. కానీ వాటిని కోయించడానికి ఒక్కో కూలీకి రోజుకు సుమారు 300 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కోసిన తర్వాత మార్కెట్‌కు తరలించేందుకు ఒక్కో బాక్సుకు దాదాపు 50 రూపాయల రవాణా ఖర్చు అవుతోంది.
రైతులు ఎంతో కష్టపడి పండించిన టమోటాలను మార్కెట్‌కు తీసుకెళ్తే అక్కడ వ్యాపారులు ఒక్క బాక్సుకు 40 నుంచి 50 రూపాయలు మాత్రమే ధర చెబుతున్నారు. రవాణా ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు టమోటా అమ్మితే మరింత నష్టమే అన్న పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది రైతులు పంటను కోయకుండానే పొలాల్లో వదిలేస్తున్నారు.
పంట మేతగా… రైతు కంటతడి
కొంతమంది రైతులు పరిస్థితి దారుణంగా మారడంతో టమోటా కాయలను గొర్రెలు, పశువులకు మేతగా వేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంటను ఇలా మేతగా వేయాల్సి రావడం రైతుల గుండెలను పిండేస్తోంది. పంటను చూసి గర్వపడాల్సిన రైతు ఇప్పుడు అదే పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
ప్రభుత్వం జోక్యం అవసరం… రైతుల విజ్ఞప్తి
టమోటా ధరలు కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల భారం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లే టమోటాను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టమోటా పంటపై ఆశలు పెట్టుకున్న రైతుల కళ్లలో ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలింది…
“ఎంత కష్టపడ్డా రైతు కష్టానికి విలువ ఎప్పుడు వస్తుందన్నది బేతాళ ప్రశ్నగా మారింది.
