రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు

రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు

రోడ్డుపైనే కూర్చుని కాంగ్రెస్‌ నాయకుల నిరసన… ఎయిర్‌-టె-ల్‌ తవ్వకాలపై ఆగ్రహం
కేబుల్‌ పనుల పేరిట రోడ్లను ధ్వంసం చేస్తున్న కంపెనీ
గుంతలో కూర్చుని నిరసన తెలిపిన మాజీ కార్పొరేటర్‌ చిరుమామిళ్ళ నాగేశ్వరరావు
గ్రావెల్‌ పోసి వదిలేసిన తవ్వకాలు.. వాహనదారులకు ప్రమాదం
నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలో ఎయిర్‌-టె-ల్‌ కంపెనీ కేబుల్‌ పనుల పేరిట రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత నెల రోజులుగా నగరంలోని పలుచోట్ల బిటి, సిమెంట్‌ రోడ్లను తవ్వి పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత రోడ్లను పునరుద్ధరించకుండా అలాగే వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మధ్యలో గుంతలు ఉండటంతో ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


రోడ్లను తవ్వి పాడుచేయడంపై మాజీ కౌన్సిలర్‌ చిరుమామిళ్ల నాగేశ్వరరావు వినూత్నంగా నిరసన తెలిపారు. తవ్విన గుంత వద్దకే వెళ్లి రోడ్డుపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లను పాడుచేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఎయిర్‌-టె-ల్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రహదారులను వెంటనే పునరుద్ధరించాలని లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


కేబుల్‌ వేసిన తర్వాత తవ్విన రోడ్లను సరిగా పూడ్చకుండా కేవలం గ్రావెల్‌ పోసి వదిలేస్తున్నారని స్థానికులు అంటు-న్నారు. దీంతో రహదారులు అసమానంగా మారి వాహనాలు సరిగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడే ప్రమాదం ఉందని ప్రజలు చెబుతున్నారు. వర్షం పడితే ఈ గుంతలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్లను పునరుద్ధరించకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

కమిషనర్‌కు ఫిర్యాదు :

ఈ విషయంపై మాజీ కౌన్సిలర్‌ చిరుమామిళ్ల నాగేశ్వరరావు ఖమ్మం నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలో ఎయిర్‌-టె-ల్‌ కంపెనీ రోడ్లను తవ్వి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. తవ్విన రోడ్లను వెంటనే బిటి లేదా సిమెంట్‌తో పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply