Expo-2026 | రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్

Expo-2026 | రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్
Expo-2026 | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరో కీలక అడుగు వేసింది. విశాఖపట్నంలో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ అభివృద్ధి కోసం మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్‌తో మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ముంబయిలో జరిగిన IAAPI (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్) ఎక్స్‌పో-2026 వేదికగా పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’లో భాగంగా, వినోద రంగాన్ని రాష్ట్ర పర్యాటక వృద్ధికి ప్రధాన చిహ్నంగా మలిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్, రిసార్ట్ విస్తరించి ఉండేలా ప్రణాళికలు రచించామన్నారు.
ఇందులో 100 గదుల (Keys) సామర్థ్యం కలిగిన విలాసవంతమైన రిసార్ట్ ఉంటుందని, సుమారు 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. “మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రధాన కేంద్రంగా 2017లో ప్రారంభమైన మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్, వినోద రంగంలో దాదాపు తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉంది. మోడర్న్ గ్రూప్ ఆధ్వర్యంలో వీరు ‘మస్తీ ల్యాండ్’ బ్రాండ్‌తో అమ్యూజ్‌మెంట్ పార్కులు, గేమింగ్ జోన్లు, రెస్టారెంట్లు, రిసార్టులను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నిర్వాహకులకు ఈ రంగంలో 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉందని” మంత్రి దుర్గేష్ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… విశాఖపట్నం నగరం గ్లోబల్ కోస్టల్ టూరిజం హబ్‌గా వేగంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. నగరంలో మెగా అమ్యూజ్‌మెంట్ పార్కులను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి వినోద మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
‘కొత్త ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024–2029’ ప్రకారం ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (APTA) అన్ని అనుమతులను త్వరితగతిన మంజూరు చేయనుందన్నారు. ఈ విధానం కింద 25 శాతం వరకు ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ, పారిశ్రామిక టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ సరఫరా, 100 శాతం నెట్ ఎస్జిఎస్టి రీయింబర్స్‌మెంట్ వంటి ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
