వేసవి దాహార్తికి చలివేంద్రాలు

వేసవి దాహార్తికి చలివేంద్రాలు
మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా
హనుమాన్‌పేటలో 2 కేంద్రాల ప్రారంభం..
సెంట్రల్ నియోజకవర్గంలో 100కుపైగా చలివేంద్రాల ఏర్పాటు
కేదారేశ్వరరావు పేట, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు. 36వ డివిజన్‌లోని హనుమాన్‌పేట ఏలూరు లాకులు సెంటర్, పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం పాదచారులు, కార్మికులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చారు.
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చల్లటి మంచినీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలను అందుబాటులో ఉంచడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా రహదారులపై ప్రయాణించే పాదచారులు, ఆటో డ్రైవర్లు, కూలీలు, రోజువారీ పనుల కోసం బయట తిరిగే కార్మికులకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.

ప్రజలకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సుమారు 100కుపైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, చల్లటి మంచినీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వేసవి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలను ఎండకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి శీతల పానీయాలను తరచూ తీసుకోవడం ద్వారా వడదెబ్బలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం కూటమీ నాయకుల ఆధ్వర్యంలో వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రహదారుల వెంట ఏర్పాటు చేసిన చలివేంద్రాల ద్వారా పాదచారులు, వాహనదారులకు ఉచితంగా చల్లటి మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు కూడా ఈ కార్యక్రమాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్‌కు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


