విద్యార్థుల కళలకు డిజిటల్ రెక్కలు..

విద్యార్థుల కళలకు డిజిటల్ రెక్కలు..

  • కలెక్టర్ మను చౌదరి కీలక నిర్ణయం
  • విద్యార్థిలతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

ఘట్ కేసర్, ఆంధ్రప్రభ ; విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారి కళలకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస ఫైన్ ఆర్ట్స్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

కళలకు వ్యాపార తోడ్పాటు..
పాఠశాలలో విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ ను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విద్యార్థుల ప్రతిభ నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి అందులో విద్యార్థుల చిత్రకళను ప్రదర్శిస్తే, ఆసక్తి గలవారు ఆన్ లైన్ లో ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల కళకు సరైన గుర్తింపుతో పాటు ప్రోత్సాహం లభిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే మ్యూజిక్ ఇన్ స్ట్రూమెంట్స్ నేర్చుకున్న విద్యార్థులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.

విద్యార్థులతో జిల్లా కలెక్టర్ భోజనం..
పాఠశాలలోని మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు కలెక్టర్ స్వయంగా విద్యార్థినులతో కూర్చుని భోజనం చేశారు. భోజనం మెనూ ప్రకారం అందుతుందా అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడా సామాగ్రి (ఫుట్ బాల్, చెస్, వాలీబాల్) తో పాటు ఫైన్ ఆర్ట్స్ కు సంబంధించిన పరికరాలు కావాలని విద్యార్థినులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు..
స్టోర్ రూమ్ లో వంట సామాగ్రిని తనిఖీ చేసిన కలెక్టర్, వస్తువుల ఎక్స్‌పైరీ డేట్ లోపు మాత్రమే వాడాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరించారు. అలాగే కూచిపూడి, గిటార్, కీబోర్డ్ వంటి విభాగాల్లో అందుతున్న శిక్షణ గురించి, సర్టిఫికేట్ కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా ప్రతిరోజూ విద్యార్థులకు నిర్ణీత సమయానికి పౌష్టికాహారం అందేలా చూడాలని వార్డెన్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఘట్ కేసర్ తాసిల్దార్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.