పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన

పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన

పల్నాడులో ప్రకృతి వ్యవసాయ నమూనాలపై నెదర్లాండ్స్ నిపుణుల బృందం ప్రశంసలు
పల్నాడులో ప్రకృతి వ్యవసాయ నమూనాలకు అంతర్జాతీయ గుర్తింపు

యడ్లపాడు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లాలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని నెదర్లాండ్స్‌కు చెందిన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన పొందేందుకు నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్‌కు చెందిన నిపుణుల బృందం పల్నాడు జిల్లాలో పర్యటించింది.

ఈ పర్యటన జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కే. అమలకుమారి ఆధ్వర్యంలో జరిగింది.యడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామంలో శ్రీమతి పుణ్యాత్ముల కోటేశ్వరమ్మ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ బయో రిసోర్స్ సెంటర్‌ను బృందం సందర్శించింది. అక్కడ తయారు చేస్తున్న వివిధ కషాయాలు, జీవామృతాలు మరియు రైతులకు అందిస్తున్న సేవల గురించి కోటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న బయో రిసోర్స్ సెంటర్ కార్యకలాపాలను ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారి బృందానికి వివరించారు.


తదుపరి యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సార్వత్రిక సూత్రాల చక్రం గురించి బృందానికి వివరించారు. అనంతరం ఏటీఎం మానం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉన్న ఎ-గ్రేడ్ మోడల్ ఫీల్డ్‌ను బృందం పరిశీలించింది. ఈ మోడల్‌లో మునగ, బీర, సొర, పొట్ల, దొండ వంటి పంటల సమ్మేళనం ద్వారా ఏర్పాటు చేసిన వ్యవస్థను నిపుణులు పరిశీలించారు.


ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ ఈ నమూనా ఆగ్రో ఫారెస్ట్రీ అమలుకు మంచి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఈ విధానంతో నేలపై మరియు భూమిలోపల జీవ వైవిధ్యం పెరగడమే కాకుండా పంటల్లో కీటక సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. విభిన్న పంటల సాగుతో పాలినేషన్ మెరుగుపడి దిగుబడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.


ఫీల్డ్ సందర్శన అనంతరం జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలపై ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది, మహిళా సంఘాలు, ఇగ్గార్ల మెంటర్లు మరియు ఫీల్డ్ సపోర్ట్ సిబ్బందితో బృందం పరస్పరం చర్చించింది. కార్యక్రమాల అమలు విధానం, నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లను కూడా పరిశీలించారు.
టీమ్ లీడర్ లారెన్స్ జోన్స్ వాల్టర్స్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరిస్తుండడం అభినందనీయమన్నారు. ఇలాంటి నమూనాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఈ పర్యటన ద్వారా భవిష్యత్‌లో పరిశోధన సహకారం మరియు ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు.


ఈ కార్యక్రమంలో వాగెనింగెన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్‌కు చెందిన లారెన్స్ జోన్స్ వాల్టర్స్, గెర్ట్ వాన్ డ్యూన్కెర్కెన్, సైమన్ జెన్నె ఓస్టింగ్, సౌమ్య కాంతి కర్వారు, కళ్యాణ్ గుంటుబోయిన తదితరులు పాల్గొన్నారు. అలాగే రైస్ సంస్థకు చెందిన ధర్మేందర్, ఓంకార్ పాల్గొన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే. అమలకుమారి, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్‌రాజ్, డీపీపీ, ఎన్‌ఎఫ్‌ఏ, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది మరియు ఇగ్గార్ల సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Leave a Reply