Fact | జీవో 111ను తుంగలో తొక్కి అక్రమ క్రషింగ్

Fact | జీవో 111ను తుంగలో తొక్కి అక్రమ క్రషింగ్

ప్రభుత్వం, మైనింగ్ అధికారులు కుమ్మక్కు
ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

Fact | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సమీపంలోని హిమాయత్‌సాగర్ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషింగ్ కార్యకలాపాల గుట్టు రట్టు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ఈరోజు ఉదయం కొకాపేట్ సమీపంలోని నియోపోలిస్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌ను సందర్శించి పరిశీలించింది. ఈ క్రషింగ్ యూనిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులకు సంబంధించినదిగా ఆరోపణలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు అక్కడ జరుగుతున్న పలు అక్రమాలను బయటపెట్టారు.

ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ డా. మన్నె క్రిషాంక్, తెలంగాణ వైల్డ్‌లైఫ్ బోర్డు మాజీ సభ్యుడు ఎస్. రాఘవేందర్, ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యుడు జి. శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకుడు అభిలాష్ రంగినేని సభ్యులుగా పాల్గొన్నారు.

Fact |

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన బినామీల పేరుతో నడుస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషింగ్ యూనిట్‌ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టామని గుర్తు చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు ‘కేజీఎఫ్’ సినిమాను తలపించాయని, ఇప్పుడు నియోపోలిస్ ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు దానికంటే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Fact |

భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తప్ప ఇతర శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించారు. అయినప్పటికీ ఈ యూనిట్‌లో భారీ స్థాయిలో క్రషింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. నెలకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోందని, ఆ మొత్తం ముఖ్యమంత్రి బంధువుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు.

జీవో 111 పరిధిలో సాధారణ ప్రజలు చిన్న ఇల్లు కూడా నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వని అధికారులు, అదే ప్రాంతంలో 17 ఎకరాల్లో భారీగా క్రషింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం పాలకులతో కుమ్మక్కైందా అని నిలదీశారు.

మూడు ఆధునిక క్రషర్లతో గుట్టలను కొల్లగొడుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి (PCB), మైనింగ్ శాఖలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పదిహేడు ఎకరాల భూమిని నామినేషన్ పద్ధతిలో ఎలా కేటాయించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఈ క్రషింగ్ యూనిట్ నుంచి తీసిన కంకరనే చుట్టుపక్కల నిర్మాణాలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఫత్వా జారీ చేశారనే సమాచారం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని, అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదిస్తామని స్పష్టం చేశారు.

CLICK HERE TO READ MORE : నకిలీ యాప్​ల నుండి రక్షించుకోడం ఎలా

CLICK HERE TO READ MORE :

Leave a Reply