ఉండవెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో విషాదం

ఉండవెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో విషాదం

రోడ్డు ప్రమాదంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చిన్నమ్మ మృతి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబానికి చెందినవారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఎంపీ చిన్నమ్మ మణెమ్మ మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉండవెల్లి మండలంలో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి కంచిపాడు జమ్ములమ్మ ఆలయానికి కారులో వెళ్తుండగా ఉండవెల్లి వద్ద అడ్డుగా వచ్చిన బైకును తప్పించబోయిన క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంపీ చిన్నమ్మ మణెమ్మను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ఎంపీ చిన్నాన్న మద్దిలేటి, చిన్నాన్న కుమారుడు నాగరాజుకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరినట్లు తెలిసింది. మణెమ్మ మృతితో ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన ఉండవెల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply