టాప్‌ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్‌ లంచ్‌మీట్‌.

టాప్‌ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్‌ లంచ్‌మీట్‌.

ప్రభుత్వ పాఠశాలల ఫలితాలకు లోకేష్‌ విద్యా సంస్కరణలే కారణం.
ప్రతిభ కనబర్చిన టెన్త్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు.

కర్నూలు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టెన్త్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన టాప్‌–5 విద్యార్థులకు మంత్రి తన నివాసంలో ప్రత్యేక లంచ్‌మీట్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్వయంగా ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించిన మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు, బోధన విధానాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్లే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యలో ఇదే ప్రతిభ కొనసాగించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో విశ్వాసం పెంచేలా విద్యార్థులు మరింత కష్టపడి చదవాలని ఆకాంక్షించారు.

లంచ్‌మీట్‌లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులు పిక్కిలి లిఖిత (593), పింజరి గిరీష్‌ (591), మీసాల మేఘన (587), కురువ మల్లికార్జున (581) మార్కులు సాధించగా, సీ క్యాంపు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి గాజుల రోహిత్‌ 582 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.

మంత్రి స్వయంగా ఇంటికి పిలిచి సత్కరించడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌, టీజీ భరత్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply