జనసేన కమిటీల నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి..
రాబోయే తరం జనసేనదేనని ఎంపీ బాలశౌరి ధీమా
మాట నిలబెట్టుకునే నాయకుడు పవన్ కళ్యాణ్..
నందికొట్కూరులో జనసేన సారథుల సమావేశంలో ఎంపీ బాలశౌరి
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. పదేళ్ల క్రితం ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడిగా పవన్ కళ్యాణ్‌పై నమ్మకం ఉంచిన సామాన్యులకు నేడు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ఆయన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారని అన్నారు.
గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తనతో కలిసి నడిచిన ప్రతి జనసైనికుడి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గర్వంగా మాట్లాడతారని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పారదర్శకమైన వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. మాటలు చెప్పే నాయకులు చాలామంది ఉన్నా, మాట నిలబెట్టుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ అని బాలశౌరి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో త్వరలో జనసేన అతిపెద్ద రాజకీయ కుటుంబంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు, దాడులు ఎదురైనా పార్టీని వీడకుండా సేవ చేస్తున్న కార్యకర్తలను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
రాబోయే తరం జనసేనదేనని, పార్టీ కమిటీల్లో అవకాశం కల్పించే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. సమాచార సేకరణ ప్రక్రియలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన అధ్యక్షుడు చింత సురేష్‌బాబు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లమల రవికుమార్, జనసేన నాయకులు రామిరెడ్డి మధుబాబు, సుబ్బయ్య, స్థానిక నాయకులు, వందలాది మంది జనసైనికులు పాల్గొన్నారు.
