ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి…

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి…
ప్రముఖ సైకాలజిస్ట్ ప్రకాష్ బానావత్
జన్నారం, ఆంధ్రప్రభ : ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలు రాస్తే పదిలో పది పక్కాగా వస్తుందని స్థానిక ప్రముఖ సైకాలజిస్ట్ ప్రకాష్ బానావత్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమం పాఠశాల విద్యార్థులకు స్థానిక పిఆర్టియు భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర వస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఆందోళన మొదలవుతుందన్నారు.
విద్యార్థులంతా ఒత్తిడికి లోన్ కాకుండా నిర్భయంగా శ్రద్ధతో చదువుకోవాలని ఆయన చెప్పారు. పరీక్షల భయాన్ని దూరం చేసుకోవాలంటే దృఢపైన సంకల్పం, ఆత్మవిశ్వాసం తో ఉండాలని, అప్పుడే పరీక్షలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విజయవంతంగా రాస్తారని ఆయన తెలిపారు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇతరులతో పోలికలు చేసుకోకుండా సమయ ప్రణాళిక,విషయ ప్రణాళిక, సంసిద్ధతను ఏర్పరచుకొని పరీక్ష గదిలో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆయన కోరారు.

పరీక్షకు వెళ్లే రోజు ఉదయాన్నే సంతోషంగా నిద్రలేవాలని, పరీక్షకు కావలసినవి ముందు రోజు సాయంత్రానికి సర్దుకోవాలని, పరీక్ష గదిలో కూర్చున్నాక ఐదు నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలని, ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి వచ్చిన ప్రశ్నలకు జవాబులు చక్కగా రాయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శివరాజం, ఉపాధ్యాయులు పిరాజి, బీర్ష పాల్గొన్నారు.
