రైతులకు చట్టబద్ధ భరోశ కల్పిస్తున్న ప్రభుత్వం..

రైతులకు చట్టబద్ధ భరోశ కల్పిస్తున్న ప్రభుత్వం..
తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : రైతుల భూ హక్కులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గంపలగూడెం మండలం, పెద కొమిర గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతున్నాయని, అందులో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో 9,677 మంది రైతులకు ఈ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో రైతు భూ హక్కు పత్రాలపై పార్టీ రంగులు, నాయకుల చిత్రాలు ముద్రించడం వల్ల ప్రభుత్వ పథకాలు పార్టీ ప్రచారంగా మారాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
పట్టాదారు పాస్ పుస్తకం అనేది రైతు హక్కును నిరూపించే చట్టబద్ధ పత్రం కావడంతో, ప్రస్తుతం వాటిని పూర్తిగా ప్రభుత్వ అధికార రాజముద్రతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు.పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించే చర్యలు కొనసాగు తున్నాయని తెలిపారు. రైతులకు సులభంగా సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భూ హక్కుల పత్రాల్లో పారదర్శకత, స్పష్టత పెంపు ద్వారా భూ వివాదాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
