మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది..

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది..
15లోపు పట్టాలిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం
వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి అభయం
దళారుల ‘దగా’పై ఉక్కుపాదం.. బాధితులకు ‘సర్కారు’ దన్ను
పదేళ్లు కళ్లు మూసుకుని.. ఇప్పుడొచ్చి ముసలి కన్నీరా?
ప్రతిపక్షాలపై మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి ధ్వజం
ఖమ్మం, ఆంధ్రప్రభ : అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందకండి.. ఈ ప్రభుత్వం మీది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖిలో మంత్రి వారి కష్టాలను స్వయంగా విని చలించిపోయారు.
దళారుల నుంచి డబ్బులు వసూలు చేయించి ఇస్తామని హామీ
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతన మంత్రి ఎదుట వెలుగుచూసింది. తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి, రెక్కాడితే గానీ డొక్కాడని తాము రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్క పైసా కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, పేదల రక్తం తాగిన ఆ దళారుల నుంచి డబ్బును రికవరీ చేయిస్తామని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు.

చీకటి బతుకుల నుంచి వెలుగు కాలనీల వైపు
గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతున్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి… కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వివరించారు. నియోజకవర్గాల వారిగా బాధితులను గుర్తించి, వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ శవాల మీద చిల్లర ఏరుకోవద్దు
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… బాధితుల సానుభూతి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అధికారం పోగానే షెడ్ల కింద కూర్చుని డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయాల కోసం పేదలను కవచంలా వాడుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. మీ పార్టీ ఏదైనా సరే.. మీరు నిజమైన పేదలైతే ఈ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చి తీరుతుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు.

అర్హులకే పట్టా.. మార్చి 15 ‘డెడ్ లైన్
గతంలో లబ్ధి పొందిన వారిని ఏరివేసి, కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన తానే స్వయంగా వచ్చి అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మరోమారు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
