బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బరిగల ఎల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
మానవత్వం చాటుకున్నచంద్రయ్య, గ్రామస్తులు
నర్సంపేట రూరల్,ఆంధ్రప్రభ: మానవత్వానికి మారుపేరుగా నిలిచిన చంద్రయ్యపల్లె గ్రామస్తులు మరోసారి ఐక్యతను చాటిచెప్పారు. గ్రామానికి చెందిన బరిగాల ఎల్లమ్మ మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి యువకులు, పెద్దలు కలిసి ఆర్థికంగా అండగా నిలిచారు. కుటుంబానికి 50 కిలోల బియ్యం, రూ.25 వేల నగదు సహాయంగా అందజేశారు. గ్రామంలో ప్రతి ఇంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్కొక్కరం కొంత చేస్తే ఒక కుటుంబానికి పెద్ద బలం అవుతుంది. అనే సంకల్పంతో సహాయం సేకరించడం విశేషం. అంత్యక్రియల ఖర్చులకు ఇబ్బందులు లేకుండా ఉండాలని భావించి యువత సమన్వయం చేసి గ్రామ పెద్దల సహకారంతో సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గ్రామం అంటే ఒక కుటుంబం. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరం ఒకటిగా నిలబడటం మన బాధ్యత. అని పేర్కొన్నారు. సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమకు ఆపన్నహస్తంగా నిలిచిందని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇకపై గ్రామంలో ఏ పేద కుటుంబానికి ఇలాంటి దుర్ఘటనలు సంభవించినా అందరం కలిసికట్టుగా సహాయం చేయాలని గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. ముందుకు వచ్చి సహకరించిన యువకులు, పెద్దలను గ్రామస్థులు అభినందించారు. వారి సేవాభావానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో సహకారం అందించడం ద్వారా చంద్రయ్యపల్లె గ్రామం సామాజిక ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్తుల ఈ మానవతా దృక్పథం ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిగా మారాలని పలువురు ఆకాంక్షించారు.
