క్రీడలతోనే సమాజానికి స్పూర్తి..

క్రీడలతోనే సమాజానికి స్పూర్తి..
- ఆటలతో ఆదర్శాన్ని చూపిన ప్రజాప్రతినిధులు..
- ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలు ఘన విజయం..
- ప్రతినిధుల ఉత్సాహం యువతకు ఆదర్శం..
- శాప్ చైర్మన్ రవి నాయుడు…
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించిన రెండో విడత క్రీడా పోటీలు ఘన విజయాన్ని సాధించాయని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని కవరేజీ ఇవ్వడం అభినందనీయమన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచనలతో ఈ పోటీల ఆలోచన రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పోటీలు మరింత ఘనంగా జరిగాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లా ఆడటం విశేషమన్నారు.
కబడ్డీ వంటి పోటీల్లో గాయాలు పట్టించుకోకుండా పాల్గొనడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని తెలిపారు. పరుగు పందెంలో బుచ్చయ్య చౌదరి వంటి నేతలు ఉత్సాహంగా పాల్గొనడం ఆకట్టుకుందని, క్రీడల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. ఈ పోటీలు తల్లిదండ్రులు, యువతకు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం ఆనందదాయకమని, మరింత మంది పాల్గొంటే ప్రజలకు మంచి సందేశం వెళ్లేదన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తామని చెప్పడం కంటే స్వయంగా పాల్గొని ఆదర్శంగా నిలవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇదే ఉత్తేజంతో నియోజకవర్గాల్లోనూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రతిభావంతులను గుర్తిస్తున్నామన్నారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగిందని, నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయని తెలిపారు. వరుసగా రెండేళ్లు నాదెండ్ల మనోహర్ జట్టు విజేతగా నిలిచిందన్నారు.

సుభాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్ కుమార్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపారని వివరించారు.మొత్తం 13 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. 70 ఏళ్ల వయసులో కామినేని శ్రీనివాసరావు కబడ్డీ విజేతగా నిలవడం ప్రత్యేకమన్నారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్‌లో రఘురామకృష్ణరాజు జట్టు విజయం సాధించగా, క్యారమ్‌లో మంత్రి సుభాష్ విజేతగా నిలిచారని చెప్పారు. గద్దె రామ్మోహన్ అనేక విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించామని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో స్టేడియాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. క్రీడలపై అవగాహన ఉన్నవారికి ఈ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని, విమర్శలను పట్టించుకోకుండా క్రీడా రంగానికి సేవలు కొనసాగిస్తామని రవి నాయుడు స్పష్టం చేశారు.
