Etala Rajender | పేద‌ల ఇళ్ల‌ను కూల్చుతున్నారు..

Etala Rajender | పేద‌ల ఇళ్ల‌ను కూల్చుతున్నారు..

  • పెద్ద‌లు భూములు ఆక్ర‌మిస్తుంటే ప‌ట్టించుకోరా..?
  • మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

Etala Rajender | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పెద్ద‌లు భూములు ఆక్ర‌మించుకున్నా ప‌ట్టించుకోకుండా పేద‌ల ఇళ్ల‌ను కూల‌గొడుతున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని ఆమ‌ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణలో పెద్దలు వేల కోట్ల భూములు ఆక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూకట్ పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని, పేదల ఇళ్ళు మాత్రం కూలగొడుతున్నారని విమ‌ర్శించారు.

మూసి ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయడం,కూల్చడాన్ని ఒప్పుకోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మధు పార్క్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ప్రజల ఆవేదన ప్రభుత్వానికి అర్ధం కావడం లేదా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా పేదలకు భూములు, ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇళ్లును కూలగొడుతున్నారన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఇల్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ కట్టుకోవాలని సూచించారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ మందుల బకాయిలకు, డైట్ చార్జీలకు నిధులు లేవని చెప్పి రూ.5 వేల కోట్లు పెట్టీ గాంధీ పార్కు ఎలా కడతామంటున్నారని నిల‌దీశారు. తెలంగాణ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ తెలుసుకోవాల‌న్నారు. రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాల‌ని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు.

Leave a Reply