రూ.500 కోసం ఘర్షణ

రూ.500 కోసం ఘర్షణ
– పూజారిపై దాడి, ఆరోపణ..
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అర్చకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న వీరేష్‌పై, పట్టణంలోని శ్రీ సూర్యనారాయణ దేవాలయానికి చెందిన అర్చకులు సురేష్ కేవలం రూ.500 కోసం దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో, తనపై మాటల దాడితో పాటు శారీరకంగా కూడా దాడి చేసినట్లు బాధిత పూజారి వీరేష్ తెలిపారు.
చిన్న మొత్తానికి ఇలా దేవాలయంలోనే అర్చకులు గొడవ పడడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై శ్రీ చౌడేశ్వరి దేవాలయం అధ్యక్షుడు వీరనాల ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన అర్చకులే ఇలా గొడవలకు దిగడం చాలా దురదృష్టకరమన్నారు. దాడికి పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆలయ ప్రధాన కార్యదర్శి చట్ట మురళి ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రతిష్టలను మంటగోలిపిన పూజారి సురేష్‌పై కటిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనకు సైతం వెనుకాడబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

