ఫోటోగ్రాఫర్లపై దాడి అమానుషం..

మునుగోడు, ఆంధ్రప్రభ : తిరుమలగిరి మండలంలో శుభకార్యానికి ఫోటోలు తీయడానికి వెళ్లిన ఓ ఫోటోగ్రాఫర్‌పై మద్యం మత్తులో కొందరు వ్యక్తులు దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేయడం అమానుష చర్య అని మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మాధగోని సైదులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదులు గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు నిత్యం సేవలు అందిస్తూ వృత్తి పరంగా నిబద్ధతతో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. ఎలాంటి ప్రేరణ లేకుండానే తమ పనిని నిర్వర్తిస్తున్న వ్యక్తిపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఫోటోగ్రాఫర్ల భద్రతకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాటం వెంకన్న, ఉపాధ్యక్షుడు నిమ్మల నాగార్జున, కోశాధికారి నూకల లింగస్వామి,కుటుంబ భరోసా ఇంచార్జ్ సద్దల శ్రీశైలం,కమిటీ సభ్యులు తవిటి సురేష్,పున్న శంకర్,రావుల స్వామి, శిర్గమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
