అగ్రకుల పెత్తందార్ల ఆగడాలను సహించం..

అగ్రకుల పెత్తందార్ల ఆగడాలను సహించం..
చిన్నారి కుటుంబానికి అండగా నిలుస్తాం
చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే
గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా ,ఆంధ్రప్రభః నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని మల్లన్న దేవస్థానం వద్ద గొడవ కారణంగా మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన సంఘటనలో బాధితులకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలు గ్రామాన్ని సందర్శించారు. నాగర్ కర్నూల్ పట్టణంలో పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టిన అనంతరం కుమ్మెర గ్రామానికి వెళ్లి బాధితుల ఇంటిని పరిశీలించారు. బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు.
అనంతరం గ్రామంలోని బస్టాప్ వద్ద నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తన పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. గ్రామంలో బాధితుల ఇంటి నిర్మాణాన్ని అధికార పార్టీ సర్పంచ్ అడ్డుకుంటున్నారని తెలిపారు. స్థానికి మాజీ ఎమ్మెల్యేగా ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మర్రి జనార్దన్ రెడ్డిని కోరారు.
అన్ని వర్గాలు కలిసే ఉందామని, పెత్తనం చెలాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అణగారిన కులాలకు అండగా ఉంటామని మల్లన్న భరోసా ఇచ్చారు. మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగాలంటే అగ్ర వర్ణాల వారు, పెత్తందారులు భయపడాలన్నారు. బాధితుల ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తానన్నారు.
