Chintooru Accident : ఒకరు దుర్మరణం.. Andhra Prabha News

Chintooru Accident : ఒకరు దుర్మరణం.. Andhra Prabha News
చింతూరులో ఘోర ప్రమాదం
N H 30 రైలింగ్‌లోకి దూసుకెళ్లిన కారు
ఒడిస్సా యువకుడు అక్కడికక్కడే మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు
108 వాహనంలో క్షతగాత్రులకు చికిత్స
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ
చింతూరు, (పోలవరం జిల్లా ) ఆంధ్రప్రభ :
జాతీయ రహదారి 30 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన 9 మంది తమిళనాడు నుండి స్వరాష్ట్రమైన ఒడిస్సాకి బయలుదేరి సీజీ 23 ఎల్ 8406 అనే కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో విజయవాడ – జగదల్‌పూర్ జాతీయ రహదారి 30 పై భద్రాచలం – చింతూరు రహదారిలో మండలంలోని సింగన్నగూడెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన గల రక్షణ రైలింగ్‌లోకి వీరు ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్ళింది. ఇలా కారు రైలింగ్‌లోకి దూసుకెళ్ళడంతో సుమారు రైలింగ్ 10 అడుగులకు పైగా కారు లోపల నుండి బయటకు వెళ్ళింది. ఇలా కారులో ఇరుక్కుపోయిన రైలింగ్‌ను గ్యాస్ వెల్డింగ్ ద్వారా కట్ట చేశారు.

ఈ ఘోర ప్రమాదంలో అక్కడక్కడే ఒడిస్సా రాష్ట్రానికి చెందిన పురేష్ గౌడ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన క్షతగాత్రులను 108 వాహనంలో చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిన తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు ప్రధమ చికిత్సలు నిర్వహించి జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. కారులో మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా మిగిలిన ఐదుగురుకి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయట పెట్టారు.

ఈ కారులో ప్రయాణిస్తున్న వారందరూ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా వీరందరూ తమిళనాడు రాష్ట్రంలో పనుల నిమిత్తం వెళ్ళి తిరిగి వస్తుండుగా ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి పరీశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై చింతూరు ఎస్సై పేరూరి రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం అతి వేగం వలనే జరిగిందని స్థానికులు ప్రత్యేక్ష సాక్షులు పేర్కోన్నారు.
