
పాత కక్షలతో హత్య..
తమ్ముడిపై కత్తితో దాడి.. అడ్డుకోబోయిన అన్న మృతి..
రామగిరి,ఆంధ్రప్రభ: పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని తమ్ముడిపై కత్తితో దాడి చేస్తుండగా, అడ్డుకోబోయిన అన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన రామగిరి మండలం సెంటినరీకాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద చోటు చేసుకుంది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన మొలుగూరి కొమురయ్య (58) భార్య లక్ష్మితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఇదే వివాహానికి వచ్చిన తన తమ్ముడు మొలుగూరి సత్తయ్యపై పాత కక్షలను మనసులో ఉంచుకొని సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లికి చెందిన బుర్ర రాజ కొమురయ్య ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. పక్కనే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతనిపై విచక్షణ రహితవంగా దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో కొమురయ్య మృతిచెందగా, సత్తయ్య చెతులకు గాయాలయ్యాయి. రాజకొమురయ్య అతని కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఇద్దరు అన్నదమ్ములే చంపించారని కక్షగట్టినట్లు మృతుడి భార్య లక్ష్మి వివరించారు. గతంలోనూ ఇద్దరిని చంపుతానని పలుమార్లు బెదిరించినట్లు కూడా తెలిపింది. పాత కక్షలతో చివరికి తన భర్తను హత్య చేసినట్లు రోదించింది. సంఘటన జరిగిన వెంటనే రామగిరి ఎ స్ఐ శ్రీనివాస్, పోలీసులు చేరుకొని తన భర్తను వాహనంలో సెంటినరీకాలనీ డిస్పెన్సరీకి తరలించినా అప్పటికే మరణించినట్లు తెలిపింది. కొమురయ్య భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
