యాదగిరి గుట్టపై అసంపూర్తి పనులు

యాదగిరి గుట్టపై అసంపూర్తి పనులు

  • బ్రహ్మోత్సవాలు మొదలైనా వీడని రంగుల హడావుడి

యాదగిరి గుట్ట, ఆంధ్రప్రభ : స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై అప్పుడే మూడు రోజులు గడుస్తున్నా, కొండపైన పనులు ఇంకా కొనసాగుతుండటం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులకు స్వాగతం పలకాల్సిన రహదారులు, ఈ సమయంలోనూ పెయింటింగ్‌ పనులతో దర్శనమిస్తుండటం గమనార్హం.

సాధారణంగా ఉత్సవాలకు ముందే పూర్తి కావాల్సిన ఈ సుందరీకరణ పనులు, వేడుకలు మధ్యలో ఉన్నప్పుడు కూడా కొనసాగుతుండటంతో అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా కొండపైకి వెళ్లే ప్రధాన రహదారుల వెంట ఇప్పుడిప్పుడే రంగులు వేస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అటు ప్రోటోకాల్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న శిల్పకళా విగ్రహాలకు సైతం ఇప్పుడే రంగులు అద్దుతుండటం చూసి భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వంటి కీలక సమయంలో పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాల్సింది పోయి, భక్తుల రద్దీ పెరిగిన తర్వాత ఈ హడావుడి చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాల్సిన సమయంలో, రంగుల వాసన మరియు కార్మికుల హడావుడి భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రానికి వచ్చే భక్తులు కోరుతున్నారు.

Leave a Reply