శివాజీ మహారాజ్ శౌర్యానికి ఘన నివాళి

పాయకాపురం, ఆంధ్రప్రభ ; ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో శారద కాలేజీ సమీపంలో సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో సాగింది.
శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో, ట్రస్ట్ కన్వీనర్ నాగలింగం శివాజీ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో ఆధ్యాత్మికంగా ప్రారంభమైంది. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోనేరు దుర్గాప్రసాద్, లాకా వెంగళరావు యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ శౌర్యం, ధైర్యం, పరిపాలనా దక్షత నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

గెరిల్లా యుద్ధతంత్రంతో స్వరాజ్యాన్ని స్థాపించిన మహానేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. రైతుల పంటలు, ప్రజల ప్రాణాలను కాపాడే పరిపాలనను అందించిన శివాజీ మహారాజ్ సమసమాజ నిర్మాణానికి ఆదర్శమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతిభకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం దేశ నిర్మాణానికి అవసరమని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ భద్రతపై తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేశాయని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వంటి చర్యలు దేశ గౌరవాన్ని పెంచాయని పేర్కొన్నారు. “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” లక్ష్య సాధనలో శివాజీ ఆశయాలు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువత, మహిళలు పాల్గొని దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply