Indrakeeladri | ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి

Indrakeeladri | ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి
- అత్యాధునిక సాంకేతికతతో అన్నదానం, లడ్డూ పొటు అభివృద్ధి..
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు రుచికరమైన అన్నప్రసాదాన్ని వేగవంతంగా అందించే లక్ష్యంతో ఇంద్రకీలాద్రిపై మార్పులకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈఓ వి.కె. సీనా నాయక్ పర్యవేక్షణలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బృందం ఆలయాన్ని సందర్శించింది. నూతనంగా నిర్మిస్తున్న అన్నదానం భవనం, లడ్డూ పొటును వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
నూతన కిచెన్ సెటప్, అత్యాధునిక బాయిలర్ పరికరాల ఏర్పాటుపై రూపొందించిన ప్రణాళికలను ఈ బృందం పరిశీలించింది. తమ పరిశీలన అనంతరం మూడు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను, ప్రణాళికలను సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. టీటీడీ బూందీ పొటు, అన్నదానం బాయిలర్లకు విజయవంతంగా పరికరాలను సరఫరా చేసిన ‘టెక్నాలజిక్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ఆ సంస్థ డైరెక్టర్ జి. రఘునాథన్, డిజైన్ మేనేజర్ సి.హెచ్. పార్ధసారధి, సేల్స్ మేనేజర్ ఎం. కోటేశ్వరరావు, మేనేజింగ్ పార్టనర్ హరి ప్రసాద్ బృందం ఈఓ వి.కె. సీనా నాయక్ తో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈఈ-1 కోటేశ్వరరావు, ఈఈ-2 (ఇన్‌ఛార్జ్) రవీంద్ర, డీఈఈ అశోక్ కుమార్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక పరికరాల ద్వారా అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల తయారీని మరింత వేగవంతం చేసేందుకు ఈఓ సీనా నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారు. త్వరలోనే ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
