Srisailam | మార్చి 3న ఆలయ ద్వారాలు మూసివేత…

Srisailam | మార్చి 3న ఆలయ ద్వారాలు మూసివేత…

Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం లో చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం 6 గంట ల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు.ఈ కారణంగా ఆలయములోని అన్నీ ఆర్జితసేవలు, పరోక్షసేవలు, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయన్నారు.

సాక్షిగణపతి, హాఠకేశ్వరం–ఫాలధార – పంచధార ,శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుందన్నారు. దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా యిదేవిధంగా ఆలయద్వారాలు మూసివేయబడుతాయి. మూడవ తేదీ ఉదయం గం. 3లకు ఆలయద్వారాలు తెరచి మంగవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించబడుతాయి. మహామంగళహారతులు సమయం నుంచే అనగా గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడుతుంది.

అనంతరం ఉదయం గం.6.00లకు శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయద్వారాలను మూసివేయ బడుతాయి. తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించ బడుతాయి. మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10.30ల వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయి.
గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అన్నప్రసాదవితరణ కూడా నిలుపుదల చేయబడిందన్నారు. భక్తులు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

Leave a Reply