Posts | బీఆర్ ఏలకు పే స్కేల్ అమలు చేయాలి…

Posts | బీఆర్ ఏలకు పే స్కేల్ అమలు చేయాలి…

Posts | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన విఆర్ఏ లకు విఆర్వో, అటెండర్ ప్రమోషన్ లు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘము ప్రధాన కార్యదర్శి కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళం ఆర్ అండ్ బి బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో విఆర్ఎ లకు తెలంగాణాలో అమలవుతున్న విధంగా పేస్కెల్ జీతాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాపితంగా ఖాళీగా ఉన్న విఆర్వో , అటెండర్, వాచ్మెన్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ తదితర పోస్టులు అర్హులైన విఆర్ఏ లతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఆర్ఎల సమస్యలు పరిష్కరిస్తుందని విఆర్ఎ లందరూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారని అన్నారు.

గత వైసిపి ప్రభుత్వ హయాంలో జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించినప్పుడు నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ధర్నాలో పాల్గొనడమేగాక మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీఆర్ఎ ల జీతాన్ని 15000 రూపాయిలకు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి ఒకసారి, రెవెన్యూశాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ కి ఆరు సార్లు, సిసిఎల్ఎ కి మూడుసార్లు వినతిపత్రాలు అవ్వడం జరిగిందని అన్నారు.

గత 8నెలలుగా ఏ సమస్యా పరిష్కారం కాకపోగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి విఆర్ఏ లతో బలవంతంగా నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయిస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రంలో విఆర్ఎ లకు గత 8 ఏళ్ళుగా జీతాలు పెరగలేదని కేవలం 10,500 రూపాయిలతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు గత 8 ఏళ్ళల్లో వందల రెట్లు పెరిగాయని, కరెంట్ ఛార్జీలు, పిల్లల విధ్య ఖర్చులు తడిసి మోపెడయ్యాయని అన్నారు.మన పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రంలో విఆర్ఎ లకు పే స్కెల్ జీతాలు చెల్లిస్తున్నారని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పేస్సేల్ జీతాలు చెల్లించి విఆర్ఎ కుటుంబాలను పస్తుల నుండి కాపాడాలని కోరారు.

అందుకోసం పాలకులు, అధికారులకు మొదపెట్టుకున్నా ఫలితంలేదన్నారు. నామినీలను విఆర్ఏ లుగా గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.రాష్ట్ర వ్యాపితంగా అటెండర్, వాచెమెన్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని అయినా అర్హులైన విఆర్ఎ లకు ప్రమోషనన్స్ ఇచ్చి పోస్టులను ఖాళీలను భర్తీ చేయడంలేదని అన్నారు. ఈ ఖాళీలను 70 శాతం విఆర్ఎ లకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

నేటికీ ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్ఎలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలపట్ల రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన విధానాన్ని విడనాడి సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సహాయకుల సంఘం (గ్రామ సేవకుల సంఘం) డిమాండ్ చేస్తోందన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి..ఎస్ లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ గ్రామరెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు డి. అప్పారావు, సుజాత, మీనాక్షి, కె.ఈశ్వరరావు, పి.వెంకటరమణ, వై.రామారావు, జె.రామారావు, బి.తిరుపతిరావు, కె.సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply