Congress | ఒకే వార్డు.. వరుసగా మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవులు..

Congress | ఒకే వార్డు.. వరుసగా మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవులు..

17వ వార్డు రాజకీయ ప్రాధాన్యత మరోసారి రుజువు

Congress, బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ రాజకీయాల్లో కొన్ని వార్డులు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అలాంటి ప్రాధాన్యతను సంపాదించుకున్న వార్డుగా 17వ వార్డు ఇప్పుడు నిలుస్తోంది. వరుసగా ఒకే వార్డు నుంచి వైస్‌ చైర్మన్ పదవి దక్కడం పట్టణ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బత్తుల సుదర్శన్ 17వ వార్డు నుంచి ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పోటీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. అనంతరం ఆయన మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి పాలనలో కీలక పాత్ర పోషించారు.

తాజా మున్సిపల్ ఎన్నికల్లో అదే 17వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగంశెట్టి సత్యనారాయణ ప్రజల మద్దతుతో గెలుపొందారు. తాజా పాలనా సమీకరణల్లో ఆయనకు కూడా వైస్‌చైర్మన్ పదవి దక్కడం ద్వారా, ఒకే వార్డు నుంచి వరుసగా రెండుసార్లు ఈ కీలక బాధ్యత రావడం విశేషంగా మారింది. పార్టీలు మారినా, నాయకులు మారినా ఒకే వార్డు నుంచి కీలక పదవులు రావడం ఆ ప్రాంత రాజకీయ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ప్రజాభిమానం, రాజకీయ సమీకరణలు, నాయకత్వ సామర్థ్యం కలిసి వచ్చినప్పుడు పాలనలో కీలక స్థానం ఎలా ఏర్పడుతుందో 17వ వార్డు ఉదాహరణగా నిలుస్తోంది.

Leave a Reply