cash | పోగొట్టుకున్న నగదు వెంటనే…
cash | పోగొట్టుకున్న నగదు వెంటనే…
- ఆటోలో మర్చిపోయిన రూ.1.50 లక్షల బ్యాగ్..
- వెను వెంటనే స్పందించిన గవర్నర్‌పేట సీఐ నాగమురళి..
- సీసీ నిఘా తనిఖీల మధ్య తిరిగి వచ్చిన ఆటో ..
- నగదును యజమానికి అందజేసిన పోలీసులు…
- ఫలించిన సీపీ సీసీ కెమెరాల విజన్..
cash | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : నగరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలన్న సంకల్పంతో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో సీసీ కెమెరాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చిన సీపీ రాజశేఖర్ బాబు తీసుకున్న చర్యలు పలుమార్లు ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా గవర్నర్‌పేటలో జరిగిన ఘటన ఆ విజన్‌కు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
ఏలూరు జిల్లాకు చెందిన నామాల నాగేశ్వరరావు తన సోదరుడితో కలిసి ఉత్సవ అవసరాల కోసం సరుకులు కొనుగోలు చేయడానికి విజయవాడకు వచ్చారు. వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ ప్రాంతంలో అవసరమైన సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ఆటోలో గవర్నర్‌పేటలోని మనోరమ హోటల్ వద్ద దిగారు. అయితే సరుకుల తొందరలో ఆటోలోనే 1,50,000 నగదు ఉన్న బ్యాగ్‌ను మర్చిపోయారు.
కొద్దిసేపటి తర్వాత నగదు బ్యాగ్ ఆటోలోనే వదిలివచ్చినట్టు గుర్తించి ఆందోళనకు గురైన నాగేశ్వరరావు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెస్ట్ ఏసీపీకి సమాచారం అందించగా, ఆయన గవర్నర్‌పేట సీఐ నాగమురళికి విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ నాగమురళి అప్రమత్తమై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. పోలీసు బృందం సీసీ నిఘా ద్వారా ఆటోను గుర్తించే ప్రయత్నాలు చేపట్టింది.
తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే సంబంధిత ఆటో తిరిగి అదే ప్రాంతానికి చేరింది. ఆటో డ్రైవర్ తిమ్మారెడ్డి స్వచ్ఛందంగా నగదు ఉన్న బ్యాగ్‌ను పోలీసులకు అందజేశారు. అనంతరం సీఐ నాగమురళి నగదును యజమానికి సురక్షితంగా అప్పగించారు.ఘటనలో వేగవంతమైన పోలీస్ స్పందనతో పాటు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.
నగరంలో అమలు చేస్తున్న సీసీ నిఘా వ్యవస్థ ప్రజలకు రక్షణ కవచంలా మారుతోందని పోలీసులు పేర్కొన్నారు. సీపీ రాజశేఖర్ బాబు చేపట్టిన నిఘా విస్తరణ చర్యలు ఇలాంటి ఘటనల్లో స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.సమస్య తలెత్తిన వెంటనే స్పందించి, గంటల వ్యవధిలోనే నగదును యజమానికి చేరవేసిన గవర్నర్‌పేట పోలీసుల పనితీరుపై నగదు యజమానులు కృతజ్ఞతలు తెలియజేశారు.
