India | ‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ

India | ‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ
- ఓటర్లకు నాయకులను తొలగించే హక్కు రావాలన్న రాఘవ్ చద్దా
- అభివృద్ధి చేందిన కొన్ని దేశాల్లో అమలు అవుతున్న రైట్ రీకాల్
India | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రైట్ టు రీకాల్ అనేది ప్రస్తుతం భారతదేశంలో చర్చనీయాంశంగా మరింది. ఆసలు ఎంటిది ఈ రైట్ రీకాల్, పార్లమెంట్ లో ఎందుకు దీనిపై చర్చ నడుస్తుంది. భారత ప్రజాస్వామ్యంలో ఓటర్లకు ఉన్న ప్రధాన హక్కు అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవడమే. అయితే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ప్రజల ఆశలకు విరుద్ధంగా వ్యవహరించినా, మధ్యలో వారిని తొలగించే అవకాశం ప్రస్తుతం ఓటర్లకు లేదు.

ఈ పరిస్థితిని మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో ‘రైట్ టు రీకాల్’ అంశాన్ని లేవనెత్తారు. ఓటర్లకు నాయకులను ఎన్నుకునే హక్కుతో పాటు, అవసరమైతే వారిని తొలగించే హక్కు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. దీంతో ప్రజలు ఐదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేక వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు, నేతల పనితీరు సరిగా లేకపోతే మధ్యలోనే తమ ప్రతినిధిని తొలగించే అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందని రాఘవ్ చద్దా మరో అంశాన్నిపార్లమెంట్ లో ప్రస్తావించారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులపై రీకాల్ ఎన్నికలు నిర్వహిస్తారు. తైవాన్‌లో మేయర్లను ప్రజలే రీకాల్ ద్వారా పదవి నుంచి దింపిన ఉదాహరణలు ఉన్నాయి. పెరు, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్, జపాన్ వంటి దేశాల్లో స్థానిక పాలకులపై ఈ విధానం అమలులో ఉంది. బ్రిటన్‌లో కూడా ఎంపీలపై ప్రత్యేక పరిస్థితుల్లో రీకాల్ పిటిషన్ అవకాశం ఉందన్నారు. భారత్‌లో ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలపై రీకాల్‌కు సంబంధించిన నిబంధనలు లేవు. అయితే కొన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయితీ స్థాయిలో సర్పంచ్‌లను తొలగించే విధానం ఇప్పటికే అమల్లో ఉంది. దీనినే జాతీయ స్థాయికి విస్తరించాలన్నది రాఘవ్ చద్దా అభిప్రాయం.
రైట్ టు రీకాల్ ద్వారా ఏ విధంగా తొలగిస్తారు..
విదేశాల్లో రైట్ టు రీకాల్ విధానం ప్రకారం, పెద్ద సంఖ్యలో ఓటర్ల సంతకాలు సేకరించి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాభిప్రాయం తెలుసుకుంటారు. ఎక్కువ మంది ఓటర్లు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే, సంబంధిత నాయకుడిని పదవి నుంచి తొలగించి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
భిన్నాభిప్రాయాలు..
ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా భావిస్తుండగా, మరికొందరు రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చని విమర్శిస్తున్నారు. తరచూ రీకాల్ ఎన్నికలు జరిగితే అభివృద్ధి పనులకు ఆటంకం కలగవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ‘రైట్ టు రీకాల్’ అమలవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేనప్పటికీ, ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై కొత్త చర్చకు దారితీసింది. ఓటర్లకు మరింత శక్తినిచ్చే ఆయుధంగా మారుతుంది. ఈ ఆలోచన భవిష్యత్ రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
