మున్సిపాలిటీలో తాను చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యం

మున్సిపాలిటీలో తాను చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యం
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తదితరులు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 2, 13, 12, 9, 10, 19, 16, 20వ వార్డులలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జాంగిర్ తదితర నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో కౌన్సిలర్ లు గా గెలిపించి చౌటుప్పల్ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ మిత్రపక్షల జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలోనే చౌటుప్పల్ ను మున్సిపాలిటీ కేంద్రంగా, ఆర్డీవో డివిజన్‌గా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక అభివృద్ధి పనులన్నీ టీఆర్‌ఎస్ హయాంలోనే చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా చౌటుప్పల్ లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మంత్రి పదవి ఆశలో రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, చౌటుప్పల్ అభివృద్ధిపై దృష్టి లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే చౌటుప్పల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ బీఆర్ఎస్ సిపిఎం మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపిస్తేనే చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిందని అన్నారు. మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తర్వాత రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడూరి పరమేష్, తొర్పునూరి మల్లేశం, అత్తర్ పాష, దండ అరుణ్ కుమార్, బత్తుల శ్రీశైలం, గోశిక సుమతీ కరుణాకర్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దింటి బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గోపనగోని లక్ష్మణ్ గౌడ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
