Kurnool | పట్టాదారు పాస్‌బుక్ రైతుకు పాస్‌పోర్ట్ లాంటిది…

Kurnool | పట్టాదారు పాస్‌బుక్ రైతుకు పాస్‌పోర్ట్ లాంటిది…

.పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం.
కర్నూలులో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు: మంత్రి టీజీ భరత్.

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పట్టాదారు పాస్‌బుక్ అనేది కేవలం భూ పత్రం మాత్రమే కాకుండా పాస్‌పోర్ట్ లేదా కరెన్సీతో సమానమైన విలువ కలిగినదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… రైతుల భూ హక్కులను బలపరిచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్‌బుక్‌లపై నాయకుల ఫోటోలు ముద్రించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల భూమిపై వారి హక్కులను పరిరక్షిస్తూ పాస్‌బుక్‌కు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

విజన్ ఉన్న నాయకత్వంతోనే అభివృద్ధి…

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఉండటం వల్ల పెట్టుబడులు ఆకర్షించగలమని తెలిపారు. పెట్టుబడులు పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ రాష్ట్రం పురోగతి సాధిస్తుందని వివరించారు. గుజరాత్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల అభివృద్ధి వెనుక స్థిరమైన ప్రభుత్వాల పాత్ర కీలకమని మంత్రి ఉదహరించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్డీయే ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

2014-19 అభివృద్ధి పునరావృతం…

2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించి అభివృద్ధి పనులను పూర్తి చేశారని కొనియాడారు. ప్రస్తుతం కూడా అదే దిశగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

కర్నూలుకు పరిశ్రమల అవకాశాలు….

రాబోయే మార్చి నెలలో రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ రాష్ట్రానికి రానున్నారని మంత్రి తెలిపారు. ఆయన పర్యటనతో కర్నూలు జిల్లాలో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని మంత్రి వెల్లడించారు. పరిశ్రమల విస్తరణతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

Leave a Reply