శ్రీముఖలింగం సర్వసన్నద్ధం

శ్రీముఖలింగం సర్వసన్నద్ధం

శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లల్లో బిజీబిజీ

 మంత్రి అచ్చెన్నాయుడు ఆరా..

కలెక్టర్‌, ఎస్పీలకు ఫోన్లో మాట్లాడి  కీలక సూచనలు జారీ  

( శ్రీకాకుళం,  ఆంధ్రప్రభ బ్యూరో)

 శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు.

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, వారందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించాలని మంత్రి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలన్నారు. వంశధార నదిలో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకూడదని కలెక్టర్‌కు స్పష్టం చేశారు.

భద్రతా పరంగా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి మంత్రి పలు సూచనలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ముఖ్యంగా చక్రతీర్థ స్నానాల సమయంలో భక్తుల రక్షణ కోసం గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణతో శివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన అధికారుల‌కు  సూచించారు.

Leave a Reply