సమయస్ఫూర్తికి పురస్కారం.

సమయస్ఫూర్తికి పురస్కారం.

  • ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌ భార్యకు నగదు రివార్డు
  • రీజినల్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో ఘన సత్కారం

దమ్మపేట , ఆంధ్రప్రభ : సామాజిక బాధ్యతను చాటుతూ,సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక విద్యార్థిని తల్లిదండ్రులు చెంతకు చేర్చిన దమ్మపేట ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు భార్య లక్ష్మిని ఉన్నతాధికారులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఖమ్మంలోని రీజినల్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు.మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఓ ఏడో తరగతి విద్యార్థి పరారయ్యాడు. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ భార్య లక్ష్మి బాలుడి ప్రవర్తనను గమనించి, ఆత్మీయంగా పలకరించి వివరాలు ఆరా తీశారు.బాలుడు హాస్టల్‌ నుంచి పారిపోతున్నట్లు గుర్తించిన ఆమె, వెంటనే తన భర్త కృష్ణారావుకు సమాచారం అందించారు. ఆ తర్వాత విద్యార్థి దగ్గర నుండి తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ సేకరించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఇంటిలిజెన్స్ శాఖకు గర్వకారణం, అధికారుల ప్రశంసలు

ఈ సందర్భంగా రీజినల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (అడిషనల్‌ ఎస్పీ) రామోజీ రమేష్‌ మాట్లాడుతూ పోలీసులు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజా రక్షణలో భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. దమ్మపేట ఇంటిలిజెన్స్ ఎన్. కృష్ణారావు భార్య లక్ష్మి చొరవ ఇతర పోలీసు కుటుంబాలకు ఆదర్శమని కొనియాడారు. అనంతరం ఆమెకు ఆ శాఖ తరఫున నగదు రివార్డును అందజేశారు. ఈ విద్యార్థిని క్షేమంగా కాపాడిన విషయంలో కీలక పాత్ర పోషించిన దమ్మపేట ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ కృష్ణారావును, నియోజకవర్గ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నున్న శ్రీనివాసరావును కూడా అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జోనల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోనల్‌ ఇన్‌స్పెక్టర్‌ మస్తాన్‌, ఆర్‌ఐఓ సీసీ ఇస్మాయిల్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు అమరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply