Underground | మురికి సమస్యకు శాశ్వత విముక్తి

Underground | మురికి సమస్యకు శాశ్వత విముక్తి
- రూ.1250 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రతిపాదనలు
- 21వ డివిజన్‌లో రూ.545.60 లక్షల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
- ఖమ్మాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Underground | ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరాన్ని మురికి కాల్వల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలనే లక్ష్యంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నగర అభివృద్ధిలో మౌలిక వసతులే కీలకమని స్పష్టం చేశారు.
అభివృద్ధికి శంఖారావం…
బుధవారం ఖమ్మం నగరంలోని 21వ డివిజన్‌లో రూ.545.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంఖుస్థాపన చేశారు. ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలతో పాటు పరిశుభ్ర వాతావరణం కలుగుతుందని తెలిపారు.
డ్రైనేజీకి భారీ ప్రణాళిక…
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో మురికి కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.1250 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చి ఈ మహత్తర ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తాగునీటి సమస్యకు చెక్…
ఖమ్మం నగరంలో తాగునీటి కొరత లేకుండా మరో రూ.250 కోట్లతో ఆధునిక తాగునీటి పథకం పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను రూపొందించామని, ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ లక్ష్యం…
నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో నర్సింహారావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
