AP | జవాబు దారీతనంతో….

AP | జవాబు దారీతనంతో….

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రజదర్బారు లక్ష్యం.
మైలవరం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాదు

AP | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్ర‌జ‌ల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే ప్రజదర్బారు ప్రధాన లక్ష్యమని మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి వాటి త‌క్ష‌ణ ప‌రిష్కారానికి అధికారుల‌కు అక్క‌డిక‌క్క‌డే ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్ష‌న్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు త‌దిత‌రాల‌తో పాటు వివిధ రెవెన్యూ సేవ‌ల‌కు సంబంధించి అర్జీలు వ‌చ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రజలు వ్యయప్రయాసలకోర్చి నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగకుండా నియోజకవర్గ స్థాయితో పాటు ఎక్కడికక్కడ తమ సమస్యలు తెలియజేసే అవకాశాన్ని పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు క‌ల్పిస్తున్నాయ‌న్నారు. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో పలు చోట్ల ఎన్నో వేదికలలో ప్రజాదర్బారు కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అధికార యంత్రాంగాన్ని ప్రజల చెంతకు తెస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్ర‌జ‌ల‌కు ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే పీజీఆర్ఎస్‌తో పాటు స్థానిక స‌చివాల‌యాల దృష్టికీ తీసుకురావ‌చ్చ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక నాయకులు, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply