రాజముద్ర పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా

రాజముద్ర పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • కొటికలపూడిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొటికలపూడిలో పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు.

తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యం అని వివరించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం ఒకప్పుడు రైతులే అధికారులు చుట్టూ తిరిగేవారని, పాస్‌ పుస్తకం వస్తే రైతులకు అదో వరమన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపి పాస్‌ పుస్తకాలు మంజూరు చేసేలా గట్టి ప్రయత్నాలు చేసేవారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు అధికారులే పట్టాదారు పుస్తకాలు ఇస్తామంటూ రైతులు చుట్టూ తిరుగుతున్నారని, ఈకేవైసీ చేస్తున్నారన్నారు.

కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, వైస్ ఎంపీపీ బండి నాగమణి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply