Farmer | ఫార్మర్ రిజిస్ట్రేషన్ త‌ప్ప‌నిస‌రి

Farmer | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి ఉండాల‌ని, 100 శాతం మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల‌ని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో 56 శాతం మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగిలిన వారు త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగా.. ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు.

భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదని, కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడీ కేటాయించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందని పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన పథకాలైన‌ రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదని వివరించారు. రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడీ) పొందేందుకు మీ ఆధార్ భూ యాజమాన్య పాస్ పుస్తకం ఆధార్‌కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని, లేదా మీ సేవ కేంద్రం సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.

Leave a Reply