Viral-Audio-Pacs : జిప్సం జగడం Andhra Prabha Top Story
Viral-Audio-Pacs : జిప్సం జగడం Andhra Prabha Top Story
- అక్రమాలపై ఆడియో వైరల్
- “నీకెందుకు… నేను చెప్పింది రాయి!”
- చైర్పర్సన్–సంఘ సీఈవో మధ్య ఫోన్ రగడ
- వి.కొత్తపాలెం పరపతి బజారు పాలు
కోడూరు – ఆంధ్రప్రభ
కృష్ణాజిల్లా కోడూరు మండలం వి కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన జిప్సం నిల్వల వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. జిప్సం నిల్వలపై అనుమానాలు, సహకార సంఘ కార్యాలయానికి అధికారులు తాళాలు వేయడం, రైతులకు పంపిణీ చేయాల్సిన సరుకుపై స్పష్టత లేకపోవడం వంటి పరిణామాల మధ్య తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోన్ ఆడియోలు జిల్లాలో రాజకీయ, సహకార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పీఏసీఎస్ చైర్పర్సన్, ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలో చేరిన రేపల్లె పిచ్చేశ్వరరావు , సంఘం సీఈవో తోట శ్రీకాంత్ మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో జిప్సం అక్రమాలపై వచ్చిన ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలి, విచారణకు వచ్చిన అధికారులకు ఏమి చెప్పాలి, నిల్వలను ఎలా మళ్లించాలి వంటి అంశాలపై మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Viral-Audio-Pacs : “ నాగాయలంక వాళ్లకి ఇచ్చేశామని చెప్పేద్దాం”
వైరల్ అవుతున్న ఆడియోలో చైర్పర్సన్ మాట్లాడుతూ, “జిప్సాన్ని నాగాయలంక మండలం వాళ్లకు ఇచ్చేసి మనం చేతులు దులిపేసుకుందాం” అని చెప్పినట్లు వినిపిస్తోంది. జిప్సం నిల్వలపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. దీనికి సంఘ సీఈవో శ్రీకాంత్ స్పందిస్తూ, “మీరు పక్కకు తప్పుకుంటున్నారు… ఎవరొచ్చినా నన్నే అంటున్నారు” అంటూ తన ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో వ్యవహారం మొత్తం దిగువ స్థాయి అధికారులపై నెట్టివేయాలనే ప్రయత్నం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Viral-Audio-Pacs : సూపర్ వైజర్‌ను కొట్టేవాడిని”
సూపర్ వైజర్ విచారణకు వచ్చిన అంశం ప్రస్తావనకు రావడంతో చైర్పర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆడియోలో వినిపిస్తోంది. “నేను పీఏసీఎస్‌కి వస్తే బీపీలోనే సూపర్వైజర్ను కొట్టేవాడిని” అంటూ మాట్లాడినట్లు రికార్డయింది. అధికారులపై ఈ తరహా భాష వాడటం, విచారణ వ్యవస్థను తేలికగా తీసుకోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. స్థానిక సహకార సంఘాల వర్గాలు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. విచారణకు వచ్చిన అధికారులను బెదిరించే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొంటున్నారు.
Viral-Audio-Pacs : అదంతా ఆర్బీకే వాళ్లు చూసుకుంటారు”
జిప్సం అక్రమాలపై ప్రశ్నలు వస్తే ఎలా సమాధానం చెప్పాలన్న దానిపైనా ఆడియోలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. “అక్రమంగా కొన్న జిప్సంను నాగాయలంక వాళ్లు ఎత్తుకుపోయారని చెబుదాం… నీకెందుకు?” అంటూ చైర్పర్సన్ సీఈవోను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే దీనికి సీఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “ఈలోపు ఎవరన్నా వస్తే సమాధానం ఏమి చెప్పాలి?” అని ప్రశ్నించగా, “అదంతా ఆర్బీకే వాళ్లు చూసుకుంటారు… నీకెందుకు?” అంటూ చైర్పర్సన్ దురుసుగా స్పందించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో సహకార సంఘం వ్యవహారాల్లో ఇతర శాఖల పేర్లు ప్రస్తావనకు రావడం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది.
Viral-Audio-Pacs : బిల్లులు అడిగితే బెదిరింపులా?
జిప్సం కొనుగోలు, రవాణాకు సంబంధించిన ‘ఓ ఫామ్’, ట్రాన్స్పోర్ట్ బిల్లులు ఇంకా అందలేదని సీఈవో ప్రశ్నించిన సందర్భంలో కూడా చైర్పర్సన్ ఒత్తిడి తెచ్చినట్లు ఆడియోలో వినిపిస్తోంది.
“నీకెందుకు… నువ్వు పుస్తకంలో నేను చెప్పింది రాయి” అంటూ సీఈవోపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రికార్డుల్లో మార్చాలని ఒత్తిడి తెచ్చారా అనే అనుమానాలు ఈ వ్యాఖ్యలతో మరింత బలపడుతున్నాయి.
Viral-Audio-Pacs : “నువ్వే అల్లరి చేస్తున్నావ్”
సంభాషణ చివరిలో చైర్పర్సన్, “నువ్వు అల్లరి చేయకుండా మెదలకుండా కూర్చుంటే ఏమీ ఉండదు… నువ్వే అల్లరి చేస్తున్నావ్” అంటూ సీఈవోను హెచ్చరించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
సహకార సంఘం అధికారులపై ఒత్తిడి, బెదిరింపుల కోణంలో కూడా ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
Viral-Audio-Pacs : ఇప్పటికే వివాదాల్లో పీఏసీఎస్
ఇటీవల వి కొత్తపాలెం పీఏసీఎస్‌లో జిప్సం నిల్వలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రైతులకు పంపిణీ చేయాల్సిన వందల బస్తాల జిప్సం నిల్వలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులు, నిల్వలు సరిపోకపోవడంతో కార్యాలయానికి తాళాలు వేసిన ఘటన కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియోలు వ్యవహారాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమేనా? అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందా? రికార్డుల్లో మార్పులు చేయాలన్న ఒత్తిడి తెచ్చారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Viral-Audio-Pacs : పూర్తి స్థాయి విచారణకు డిమాండ్
వైరల్ ఆడియోల నేపథ్యంలో జిప్సం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతు సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆడియోల నిజానిజాలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
