60days | హమ్మయ్య.. ఇక ఊపిరిపీల్చుకోవచ్చు
60days | హమ్మయ్య.. ఇక ఊపిరిపీల్చుకోవచ్చు
60days | ముగిసిన అమెరికా అధ్యక్షుడి ఆదేశాల కాలపరిమితి
ఇప్పటి నుంచి ఇరాన్‌పై దాడి చేయాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పని సరి
ఈ స్థితిలోనే యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ యంత్రాంగం ప్రకటన
60days | సెంట్రల్ డెస్క్ , ఆంధ్రప్రభ : ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించి 60 రోజులు అవుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కీలక ప్రకటన చేసింది. తాము యుద్ధంలో లేమంటూ అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. సైనిక చర్య కోసం కాంగ్రెస్ ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్ మీద దాడులు ప్రారంభించారు. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసిందని చెబుతున్నారు.
ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ..
అమెరికా కాంగ్రెస్ అనుమతిని తప్పించుకునే విషయంలో ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏప్రిల్ మొదటివారంలోనే ఇరాన్‌తో అమెరికా యుద్ధం ఆగిపోయిందని సెనెట్‌లో ప్రకటించింది. ఆ దేశంతో యుద్ధం 60 రోజులకు మించి కొనసాగనందున కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా 47 – 50 ఓట్లు వచ్చాయి. ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో అమెరికా ప్రెసిడెంట్కే నిర్ణయాధికారం ఉండాలనే ప్రతిపాదనకు అనుకూలంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 49 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలవాలనే ప్రతిపాదనకు అనుకూలంగా ఇద్దరు రిపబ్లికన్లు ఓట్లు వేశారు. ఇరాన్‌పై యుద్ధం వేళ తమకు ఏమాత్రం సహకరించని నాటో కూటమి దేశాలు స్పెయిన్, ఇటలీ నుంచి అమెరికా సైన్యాల్ని వెనక్కి పిలిపించే అంశాన్ని పరిశీలిస్తున్నానని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు.
ఫిబ్రవరి 28న తొలి దాడి
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు. దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతే కాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. నిన్నటితో అది ముగిసింది. దీంతోఇరాన్ పై అమెరికా దాడులు చేసే అవకాశాలు లేవు.. ఇకపై దాడులు చేయాలంటే అక్కడి పార్లమెంట్ అమోదం తప్పని సరి.
