Weather Alert | నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు
Weather Alert | నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు
Weather Alert | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలాయి. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో నేడు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ముప్పు ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగల దగ్గరికి వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
