కనకదుర్గమ్మకు పవిత్ర ఆషాడ సారె..
- ఆషాఢ సారెకు పోటెత్తిన మహిళా భక్తులు
- 26వ రోజు రికార్డు స్థాయిలో 74 సారె బృందాలు.. 28,653 మంది భక్తుల రాక
- 95 వేల మందికి చేరువగా అమ్మవారి దర్శనం
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ మహిళా భక్తులు సమర్పించే ఆషాఢ సారెకు ఆదివారం ఇంద్రకీలాద్రిపై భారీ స్పందన లభించింది. ఆషాఢ సారె 26వ రోజు 74 సారె బృందాల్లో 28,653 మంది మహిళా భక్తులు సారె సమర్పణకు తరలివచ్చారు. ఈ ఆషాఢ మాసంలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని దేవస్థానం అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేయగా, దర్శనం అనంతరం ఆరో అంతస్తులో అమ్మవారికి సారె సమర్పించారు.

ఈవో శీనా నాయక్ సారె బృందాల సభ్యులతో మాట్లాడి ఉచిత ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే టికెట్ విక్రయాలు నిలిపివేసి అన్ని క్యూలైన్లను ఉచిత దర్శనానికి మార్చారు. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 95 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. రద్దీని నియంత్రిస్తూ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు. భక్తుల వద్దకే తాగునీరు అందించడంతో రద్దీ సమయంలో వారికి ఇబ్బందులు తగ్గాయి.
