29thaprilsplstory | కేజ్రీవాల్ నిర్ణయాలు.. పంజాబ్ రాజకీయాల్లో మార్పులు..

29thaprilsplstory | కేజ్రీవాల్ నిర్ణయాలు.. పంజాబ్ రాజకీయాల్లో మార్పులు..
29thaprilsplstory | రాఘవ్ చద్దా తొలగింపు వెనుక కారణాలు
ఆప్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయా?
బీజేపీకి కలిసొచ్చే రాజకీయ పరిణామాలు
పంజాబ్ ఎన్నికలపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
కేజ్రీవాల్ నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు
29thaprilsplstory | రాఘవ్ చద్దా… జాతీయ రాజకీయాల గురించి తెలిసినవారికి పరిచయం అక్కర్లేని పేరు. అంతేకాదు, పార్లమెంట్‌లో సామాన్యుడి గొంతుకగా మారిన ఒక యువ కెరటం పేరు అది. కొన్ని నెలలుగా కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల ఆశకు ప్రతిరూపంగా రాఘవ్ చద్దా నిలిచారు. రాఘవ్ చద్దా ఇండియా అగేనెస్ట్ కరప్షన్ ఉద్యమం సమయం నుంచి కేజ్రీవాల్ వెన్నంటే నడిచిన యువ సైనికుడు. అయితే జనం సమస్యలపై ఆయన అసలు పోరాటం మొదలైంది రాజ్యసభలో అడుగుపెట్టిన తరువాతనే. అధికార, ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు భిన్నంగా, ఆయన సామాన్యుల సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ప్రారంభించారు.

నిత్య జీవితంలో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా ఆయన రాజ్యసభలో గళమెత్తారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలలో ఇటీవల ఒక సంచలన పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ అధిష్టానం నియమించింది. అయితే రాఘవ్ చద్దా తనతో పాటు మరో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులను కమలం పార్టీ శిబిరంలోకి తీసుకెళతారని కేజ్రీవాల్ ఊహించి ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే, రాఘవ్ చద్దా స్థానంలో రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ మిట్టల్ కూడా చీపురు పార్టీకి గుడ్‌బై చెప్పడం ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌గా మారింది.
పంజాబ్ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?
మరో ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన ఈ ఎపిసోడ్ ప్రభావం పంజాబ్ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. పంజాబ్ ఎన్నికల్లో చీపురు పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి ఇప్పటికే కమలం పార్టీ సన్నద్ధంగా ఉంది. తాజా పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మరింత అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బీజేపీ శిబిరంలోకి వెళ్లిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్క స్వాతి మాలీవాల్ మినహా అందరూ పంజాబ్‌కు చెందిన వారే కావడం గమనించాల్సిన విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత హోదాలో కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు చాలా కాలంగా వివాదాస్పదంగా మారుతోంది.
ఆప్ ఏర్పడ్డ తొలి రోజుల్లో పార్టీలో కీలక పదవుల్లో ఉన్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి వారు పార్టీ నుంచి అవమానకర పరిస్థితుల్లో బయటకు వచ్చిన ఘటనలు ఇప్పటికీ చాలామందికి గుర్తున్నాయి. ఏమైనా, పార్టీ నడిపే విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఆప్ తాజా పరిణామాలను గమనిస్తే, కేజ్రీవాల్‌పై వస్తున్న విమర్శల్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయన్న అభిప్రాయం కలుగకమానదు.
ఎస్. అబ్దుల్ ఖాలిక్
6300174320
