అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఇచ్చోడ మండలంలోని జోగిపేట్ గ్రామానికి చెందిన రూబీనా బీకి సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త ముజహీద్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు తీవ్రంగా రావడంతో పరిస్థితిని గమనించిన ఈఎంటీ అనిల్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు.

దీంతో రూబీనా బీ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు 108 అంబులెన్స్ పైలెట్ నాగోరావు తెలిపారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు.

Leave a Reply