ప్రమాదాలకు నిలయంగా మారిన ధర్మారం చౌరస్తా
- మంచిర్యాల–ఆదిలాబాద్–నిర్మల్ రాష్ట్ర రహదారిపై వాహనదారుల ఇక్కట్లు
- భారీ వర్షాలతో ఏర్పడిన గుంత.. ప్రమాదాలు వరుస
- శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
జన్నారం, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా వద్ద రాష్ట్ర రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మంచిర్యాల–ఆదిలాబాద్–నిర్మల్ రాష్ట్ర రహదారిపై నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గుంత ఏర్పడింది. రోజూ వందలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ఈ మార్గం ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది.
ఈ రహదారి గుండా తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, సెర్ప్ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. రహదారి మధ్యలో ఉన్న గుంతను గుర్తించకుండా వాహనాలు వెళ్లడంతో పలువురు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇటీవల ఈ మార్గంలో కారులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి వాహనం గుంతలో బలంగా పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అనంతరం ఆమె ఆసుపత్రిలో చేరి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు స్థానికులు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారుడు గుంతలో పడిపోవడంతో నడుముకు తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
రహదారిపై తరచూ గుంతలు ఏర్పడుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా పూడ్చడం కాకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే స్పందించి గుంతను పూడ్చి, వాహనదారుల ప్రాణాలను కాపాడాలని మండల సామాజికవేత్త కొత్త శ్రీనివాస్ గుప్తా విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై మంచిర్యాల రోడ్లు–భవనాల శాఖ సహాయ ఇంజినీర్ (ఏఈ) సునీల్‌ను వివరణ కోరగా, రహదారిపై ఏర్పడిన గుంతను త్వరలోనే పూడ్చే చర్యలు చేపడతామని తెలిపారు.
