పాడి రైతుల ఆర్థిక పురోగతే కృష్ణా మిల్క్ యూనియన్ లక్ష్యం
పాడి రైతుల ఆర్థిక పురోగతే కృష్ణా మిల్క్ యూనియన్ లక్ష్యం
- చైర్మన్ చలసాని ఆంజనేయులు
గంపలగూడెం, ఆంధ్రప్రభ : పాడి రైతుల ఆర్థిక పురోగతే కృష్ణా మిల్క్ యూనియన్ లక్ష్యం అని ఆ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఆయన శనివారం తిరువూరు క్లస్టర్ పరిధిలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు,ఊటుకూరు పాల సంఘాలను సందర్శించి పాడి రైతులతో మాట్లాడారు. పాడి పరిశ్రమలో ఆధునిక పద్ధతులు, పశుసంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు, రైతు సంక్షేమ పథకాలు ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతు కుటుంబాలకు ప్రతి రోజు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
రైతు ఆర్థికంగా బలపడితేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, గ్రామాభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు.సహకార పాల సంఘం ద్వారా రైతులు నేరుగా లాభపడే విధంగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిట్టుబాటు ధర, పారదర్శకతతో కొవ్వు శాతం పరీక్షలు, సమయానికి చెల్లింపులు, బోనస్‌లు,సబ్సిడీపై పశుదానం కాల్షియం,మినరల్ మిక్చర్, పశువైద్య సేవలు, అత్యవసర చికిత్సలు, మొబైల్ వెటర్నరీ సేవలు, కృత్రిమ గర్భధారణ సేవలు, పశు బీమా వంటి అనేక సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
అవగాహన సదస్సులో వెటర్నరీ నిపుణులు రైతులకు పాడి పశువుల ఆరోగ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు.ముఖ్యంగా సమతుల్య ఆహారం, పచ్చిమేత ప్రాధాన్యత, పశువుల నివాస పరిశుభ్రత, సకాలంలో టీకాలు,డీ వార్మింగ్, కాల్షియం, మినరల్ మిక్చర్ వినియోగం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవచ్చని వివరించారు.పశువుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే పాల దిగుబడి తగ్గడంతో పాటు ఆర్థిక నష్టం కలుగుతుందని అన్నారు.
గేదె ఈనిన మూడు నెలల తరువాత తప్పనిసరిగా చూడు కట్టించాలని, సమయానికి కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన దూడలు, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పశువులను పొందవచ్చని వివరించారు. అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పిడి గన్ ద్వారా కృత్రిమ గర్భధారణ సేవలు,సిబిటి విధానంలో చూసే నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించి రైతులకు ప్రదర్శించారు.కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సిహెచ్. వీరభద్రరావు,సిహెచ్ సత్యనారాయణ,క్లస్టర్ మేనేజర్ పి.ప్రసాద్,వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ లింగం ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.
