యువతే దేశ భవిష్యత్..
- బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ‘హర్ ఘర్ తిరంగా’ జెండా ర్యాలిని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి, జాతీయ భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
మోదీ ప్రభుత్వం భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. యువత, విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయడానికి దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను విస్తరిస్తున్నామని రాంచందర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
