పోలీసులతో భజన చేయిస్తున్నారా..?

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌పై మాజీమంత్రి పేర్ని నాని విమర్శలు


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని బృహత్తర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేసి పోలీసు వ్యవస్థతో భజన చేయించుకుంటున్నారని కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గురువారం మచిలీపట్నంలో మాట్లాడుతూ… రాష్ట్రంలోని 1100 పోలీస్ స్టేషన్ ల పరిధిలోని సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి నుండి సమస్యలు, పనితీరును తెలుసుకోకుండా భజనకి పరిమితం కావడం దారుణమన్నారు. ఖద్దర్ కిక్కు కోసం పొగడ్తలకు అలవాటు పడిన సీఎం చంద్రబాబు శృతిమించిన విధంగా తయారయ్యారని, రాబోయే ఎన్నికల్లో పోలీసులను విచ్చలవిడిగా వాడుకునే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ల పేరిట ఎత్తుగడలు వేస్తున్నారన్నారు.

సీఎం పోలీస్ అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో రాజకీయ నాయకులను మించి కొంతమంది పోలీసు అధికారులు సీఎం భజన చేయడం సిబ్బందిని విస్మయానికి గురి చేసిందని, సోషల్ మీడియా కేసుల్లో వైసీపీని అణగదొక్కేందుకు చట్టాలను సవరించాలని కొంతమంది పోలీసు అధికారులు సూచించడం దారుణమన్నారు.

మానవ హక్కులు ప్రజాస్వామ్య విలువలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, రాజమండ్రిలో ఉజ్వల భవిష్యత్తు వల్ల డాక్టర్ ను ఇద్దరు తాగుబోతులు కారుతో గుద్దించి మరీ చంపితే ఏం చేశారో సమాజం చూసిందన్నారు. చిత్తూరులో గంజాయి మత్తులో పోలీస్ కాలర్ పట్టుకుని కొడితే నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకోవడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసులు పెడితే రోడ్డుమీద నడిపించే పోలీసులు రాష్ట్రంలో మహిళలు అభాగ్యులపై అరాచకాలు చేస్తున్న కూటమి నాయకులను ఏమి చేస్తున్నారో తెలపాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు.

దిశా చట్టం రద్దుచేసి మహిళల రక్షణకు ప్రాధాన్యమంటూ కూటమి ప్రభుత్వం వ్యాఖ్యలు చేయడం దారుణమని, హోమ్ మినిస్టర్ డాక్టర్ మృతి పైన స్పందించదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్లు ద్వారా సంతాపం తెలిపి చర్యలకు ఉపక్రమించరన్నారు.

భీమవరంలో పేకాటలు ఆడితే వాటిపైన స్పందించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల అరాచకాలపై స్పందించకపోవడం దారుణమని, పవన్ కు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం సుగాలి ప్రీతి… మహిళలు మిస్సింగ్ మహిళలపై దాడులు గుర్తొస్తాయన్నారు. పోలీస్ సిబ్బందితో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ తో టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైందని, భజన చేయడంలో రాజకీయ నాయకులను మించిపోయి కాకీలు వ్యవహరిస్తున్నారని మల్లగులాలు పడుతున్నారన్నారు.

అమరావతిలో కట్టడాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వ ప్రచారాలు అసాధారణంగా ఉన్నాయని, ఆరు సంవత్సరాల కాలంలో 9 కట్టిన 9 అంతస్తుల అపార్ట్మెంట్లు ఎమ్మెల్యేలకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వాటిలో ఏ ఎంఎల్ఏ వినియోగిస్తాడో… లేక గన్ మాన్ లకు ఆవాసాలుగా మారుస్తారో చూడాల్సి ఉందన్నారు.

ప్రపంచంలో ఎక్కడా జరిగని విధంగా అద్భుత తీరులో అమరావతిలో పనులు జరుగుతున్నాయని కొన్ని చానల్స్ పెయిడ్ వార్తలను పుంకాలుగా ప్రచారం చేస్తున్నాయి… ఒరిజినల్ అమరావతిలో ఉన్నటువంటి ప్రజలు రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు… వర్షమే ఆధారంగా… ఎరువులు, సాగునీరందక అమరావతి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.. కూటమి నాయకులు సాకులు, బూటకపు వాగ్దానాలను మాని కృష్ణా డెల్టాకు సాగునీరందించి.. రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.