భీముని తండాలో గుడుంబాపై పోలీసుల దాడులు
- 15 లీటర్ల గుడుంబా స్వాధీనం
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : తొర్రూరు మండలంలోని భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తండాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గుడుంబా తయారీ లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడుల్లో తొర్రూరు అదనపు ఎస్సై ఖాదర్ పాషా, పోలీసు కానిస్టేబుళ్లు శరత్, మధు పాల్గొన్నారు.
