యువతే కాంగ్రెస్‌కు వెన్నెముక

2029లో రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటమే లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో యూత్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను ఎంపిక చేసే విధానం కాంగ్రెస్‌ పార్టీకే ప్రత్యేకమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు.

కాంగ్రెస్‌ పార్టీకి అధికారాన్ని తీసుకురావడంలో యువతది కీలక పాత్ర అని గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్న అనేక మంది నాయకులకు యూత్‌ కాంగ్రెస్‌ వేదికగా నిలిచిందన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ సేవలు అభినందనీయమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి నాయకుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 2029 ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే లక్ష్యంగా యువత పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండం శ్రీకాంత్‌, ఇన్‌చార్జి రజినీకాంత్‌, మహిపాల్‌, కౌన్సిలర్లు అప్పం కిషన్‌, అరుణ్‌రావు, నాయకులు వెంకీ యాదవ్‌, చరణ్‌, చుంచు మహేష్‌, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.