భీమ్‌గల్‌ యువ కవికి అరుదైన గౌరవం

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యువ కవి సమ్మేళనంలో భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామానికి చెందిన యువ కవి, రచయిత ముచ్కూర్‌ సుమన్‌గౌడ్‌కు అరుదైన గౌరవం లభించింది. యువతను దారి తప్పిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘యుద్ధం మొదలైంది’ అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనంలో సుమన్‌గౌడ్‌ తన కవితను వినిపించారు. ఆయన కవితకు విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా కరీంనగర్‌ మున్సిపల్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సుమన్‌గౌడ్‌ను శాలువా, పూలమాల, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు. గంజాయిపై సుమన్‌గౌడ్‌ రాసిన కవిత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సమాజ సమస్యలపై తన అక్షరంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ భవిష్యత్తులో మరిన్ని రచనలు, కవితలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.